ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావంతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం
29-10-2026 09:32
అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాజెక్టులు, జలాశయాలకు వరద నీరు చేరుతోంది.
xPress24, Paravathipuram, October 28,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 28:
అర్నబ్ తుపాను ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాజెక్టులు, జలాశయాలకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
పెద్దగెడ్డ రిజర్వాయర్‌కు 11,639 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ప్రస్తుతం ఆ నీటిని రిజర్వాయర్‌లోనే నిల్వ చేస్తున్నారు. జంఝావతి ప్రాజెక్టుకు 542 క్యూసెక్కుల నీరు చేరుతోంది. రబ్బర్ డ్యామ్‌ను డిఫ్లేట్ చేసి ఉంచడంతో, ప్రాజెక్టుకు చేరుతున్న నీటిని అదే పరిమాణంలో నదిలోకి విడుదల చేస్తున్నారు.
తోటపల్లి బ్యారేజీకి నాగావళి నది నుంచి 2,809 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజీ నుంచి స్పిల్‌వే, పాత ఆర్‌ఎంసీ, పాత ఎల్‌ఎంసీల ద్వారా మొత్తం 1,698 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వెంగళరాయసాగరం ప్రాజెక్టులోని సువర్ణముఖి రిజర్వాయర్‌కు 2,414 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ఆ నీటిని ప్రస్తుతం రిజర్వాయర్‌లోనే నిల్వ చేస్తున్నారు. గోముఖి రిజర్వాయర్‌లో నీటిమట్టం 162.50 మీటర్లకు చేరింది. అక్కడి నుంచి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాను ప్రభావంతో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ నీటి నిల్వలు, ప్రవాహ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం పాచిపెంట మండలంలో అత్యధికంగా 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాలూరులో 29 మి.మీ., బలిజిపేటలో 22.5 మి.మీ., మక్కువలో 13.8 మి.మీ., పాలకొండలో 12 మి.మీ., వీరఘట్టంలో 9.3 మి.మీ., సీతంపేటలో 7.5 మి.మీ., పార్వతీపురంలో 2.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో ఈ సమయానికి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 130.90 మి.మీ. వర్షపాతం నమోదవగా, సగటు వర్షపాతం 8.73 మి.మీ.గా నమోదైంది.