ఆంధ్రప్రదేశ్
తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు.. తాటిపూడి రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు ఎత్తివేత
02-11-2026 14:39
తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
xPress24, Vizianagaram, November 2,
విజయనగరం జిల్లా, నవంబర్ 2: తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు, తాటిపూడి రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు సుమారు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహాన్ని నియంత్రిస్తూ రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు స్పిల్‌వే గేట్లను ఎత్తివేశారు.
స్పిల్‌వే రెగ్యులేటర్ ద్వారా సుమారు 6,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోస్తనీ నది పరివాహక ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు నదిలోకి వెళ్లడం, పశువులను నదిలోకి తీసుకెళ్లడం వంటి పనులకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.