ఆంధ్రప్రదేశ్
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
02-11-2026 14:50

తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ సూచించారు.
xPress24, Bapatala, November 2,
బాపట్ల, నవంబర్ 2:
తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ సూచించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
చీరాల మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం అందిన వాతావరణ అంచనాల ప్రకారం తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి, నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారుజాము మధ్య నెల్లూరు–ఒంగోలు ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
జిల్లాలోని చీరాల ప్రాంతంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కొన్ని మండలాల్లో 100 నుంచి 120 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రేపల్లె వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
బాపట్ల జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలైన గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు డ్రెయిన్లు, కాలువల ద్వారా బాపట్ల జిల్లా మీదుగా సముద్రంలోకి చేరుతుందని వివరించారు.
ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల పాటు కురిసే వర్షాల సమయంలోనే కాకుండా, రానున్న నాలుగైదు రోజులపాటు కూడా జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలు పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సహకారం తీసుకోవాలని ఆయన కోరారు.