xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో అప్రమత్తమైన పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలుతుపాను ప్రభావంతో 53కు పైగా రైళ్లు రద్దుఅర్నాబ్ తుపాను ప్రభావం.. ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులులాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 482 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్దక్షిణ కోస్తా రైల్వే ముందస్తు చర్యలు
ఆంధ్రప్రదేశ్

తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలి

26-10-2026 14:27
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలి
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు.
xPress24, Machilipatnam, October 26, మచిలీపట్నం, అక్టోబర్ 25: అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోని అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖలవారీగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, తుఫాను అనంతరం తక్షణమే చేపట్టాల్సిన సహాయక, పునరుద్ధరణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన ప్రాంతాల్లో ముందుగానే సహాయ శిబిరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. శిబిరాలకు చేరుకునే ప్రజలకు తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు, నివాస వసతులు వంటి కనీస మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇతర సామగ్రిని కూడా ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. తుఫాను సమయంలో ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత ఏర్పడకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రేషన్ దుకాణాల్లో అవసరమైన సరుకులను సిద్ధంగా ఉంచడంతో పాటు, ప్రధాన గోదాముల నుంచి సరుకుల తరలింపును ముందుగానే చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సరుకుల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా పట్టణాలు, గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించి, పూడిక లేదా ఇతర అడ్డంకులు ఉంటే వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, నాచు, ఇతర వ్యర్థాలను తొలగించాలని సూచించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే నీరు జనావాసాల్లోకి చేరి ప్రజలకు, పంటలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తుఫాను సమయంలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు అదనపు విద్యుత్ స్తంభాలు, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేపట్టి, సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల అధికారులు రహదారులపై చెట్లు కూలిపోవడం, ఇతర అడ్డంకులు ఏర్పడినప్పుడు వాటిని వెంటనే తొలగించేందుకు అవసరమైన జేసీబీలు, పవర్ సా యంత్రాలు, ఇతర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫాను అనంతరం రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బంది, వనరులను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. టెలికాం ఆపరేటర్లు సెల్ టవర్ల నిర్వహణకు అవసరమైన డీజిల్ జనరేటర్లు, ఇంధనం, బ్యాకప్ విద్యుత్ సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలు వీలైనంత నిరంతరాయంగా కొనసాగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అత్యవసర సమాచార మార్పిడి, సహాయక చర్యల సమన్వయంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫాను పరిస్థితులను బట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రుల వద్దకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావం ప్రారంభమయ్యే ముందే అవసరమైన వనరులు, యంత్రాలు, సిబ్బంది, సహాయక సామగ్రిని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తుఫాను సమయంలో, అనంతరం చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రతి శాఖ తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.