ఆంధ్రప్రదేశ్
తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు
06-11-2026 14:26
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో లభ్యమైన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు.
xPress24, ongole, November 6,
ఒంగోలు:
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో లభ్యమైన తమిళనాడు మత్స్యకారుల మృతదేహాలను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎన్. మేరీ విల్సన్ గురువారం రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు. ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుతో కలిసి మంత్రి పరిశీలించారు.
పడవలో మొత్తం తొమ్మిది మంది మత్స్యకారులు ఉండగా, గురువారం నాటికి ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయని మంత్రి మేరీ విల్సన్ తెలిపారు. వాటిలో నాలుగు మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణ, పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాలను తమిళనాడుకు తరలిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, కొత్తపట్నం సముద్రతీరంలో బోల్తాపడిన పడవ తమిళనాడుకు చెందినదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం శుక్రవారం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేస్తామని వెల్లడించారు.
గాలింపు చర్యలు, సహాయక కార్యక్రమాలపై గురువారం రాత్రి ఒంగోలు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు మంత్రి ఎన్. మేరీ విల్సన్, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, కోస్ట్‌గార్డ్ అధికారులు పాల్గొని తదుపరి చర్యలపై చర్చించారు.