తెలంగాణ
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు
20-11-2026 10:04

తెలంగాణలో 2027 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 24, 2027 నుంచి ఫస్టియర్ పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభమై మార్చి 20తో ముగుస్తాయి. నూతన విధానం ప్రకారం ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు రోజుకు మూడు విడతల్లో నిర్వహించనున్నారు.
xPress24, Hyderabad, November 19,
తెలంగాణ రాష్ట్రంలో 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 24న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమై మార్చి 19వ తేదీతో ముగుస్తాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 20వ తేదీన పూర్తవుతాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలను 2027 జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
జనవరి 27న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, 29న ఎథిక్స్ పరీక్ష
ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 2027 జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 29న ఇదే సమయాల్లో నిర్వహించనున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజూ మూడు విడతల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ ప్రాక్టికల్స్ షెడ్యూల్ ఒకేషనల్ విద్యార్థులకు కూడా వర్తిస్తుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.