తెలంగాణ
తెలంగాణలో ఇక 'భారత్ విస్తార్' సేవలు.. రైతులకు తెలుగులోనే ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు
13-11-2026 09:37
తెలంగాణ రైతులకు తెలుగులోనే ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఎన్ఐఎస్‌జీ మధ్య 'భారత్ విస్తార్' అవగాహన ఒప్పందం కుదిరింది. సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా పంటల సాగు, వాతావరణం, చీడపీడల గుర్తింపు, ఎరువుల వాడకం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం హెల్ప్‌లైన్, యాప్, వాట్సాప్ ద్వారా రైతులకు అందుబాటులోకి రానుంది.
xPress24, Hyderabad, November 12,
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ తెలంగాణ రైతులకు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలను వారి మాతృభాష తెలుగులోనే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ వ్యవసాయ డిజిటల్ వేదిక 'భారత్ విస్తార్'తో తెలంగాణను అనుసంధానించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్ఐఎస్‌జీ) మధ్య సచివాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో అధికారులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సాంకేతికతను రైతులకు చేరువ చేయడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, దిగుబడులు, ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక వాతావరణం, నేల స్వభావం, రాష్ట్ర పథకాలను ఇందులో అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు.
ఒకే వేదికపై ఆరు సేవలు.. నాలుగు మాధ్యమాల్లో తెలుగులో అందుబాటు
భారత్ విస్తార్ వేదికలో ఉన్న 'భారతి' ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా రైతులు తెలుగులో మాట్లాడి లేదా టైప్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా పంటల సాగు సలహాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు, ఫొటోల ఆధారంగా చీడపీడల గుర్తింపు, సాయిల్ హెల్త్ కార్డు ప్రకారం ఎరువుల వినియోగం, మార్కెట్ ధరలు, పీఎం-కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే చోట పొందవచ్చు. 155261 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా వాయిస్ సేవలు, 21 రోజుల్లో వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, 60 రోజుల్లో వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. ఆర్‌కేవీవై కింద కేంద్ర, రాష్ట్ర నిధులతో నాలుగు దశల్లో దీనిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, డైరెక్టర్ బి. గోపి, ఎన్ఐఎస్‌జీ ప్రతినిధి షేక్ రషీద్ భాష పాల్గొన్నారు.