ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గడువు పెంపు
19-11-2026 09:49
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో ముగియాల్సిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను.. డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
xPress24, Hyderabad, November 18,
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో ముగియాల్సిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను.. డిసెంబర్ 22వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేని అర్హులు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు ఎస్‌ఐఆర్ గడువును పొడిగించిన ఎన్నికల సంఘం.. తాజాగా మరికొన్ని కీలక తేదీలను కూడా సవరించింది. ముసాయిదా జాబితా నుంచి ఓటు తొలగించిన వారికి ఈ నెల 30వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, డిసెంబర్ 10వ తేదీ వరకు వాటిని పరిష్కరించనున్నారు. అలాగే ఆగస్టు 17 నుంచి కొనసాగుతున్న నోటీసుల ప్రక్రియను ఈ నెల 26వ తేదీతో ముగించాల్సి ఉండగా, దానిని కూడా డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. డిసెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, నాగాలాండ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఎస్‌ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఓటు హక్కు కోల్పోయిన వారు, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన పౌరులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.