తెలంగాణ
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష
24-10-2026 09:51
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్షించారు. 27 క్రీడాంశాల్లో పారదర్శకంగా క్రీడాకారులను ఎంపిక చేసి, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
xPress24, Hyderabad, October 23,
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పోటీల ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ కార్యక్రమాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
27 క్రీడాంశాల్లో పారదర్శకంగా ఎంపికలు
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు 27 క్రీడాంశాల్లో దశలవారీగా క్రీడాకారులను ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో పతకాలే లక్ష్యం
దేశానికే ఆదర్శంగా పోటీలు నిర్వహించి, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని శ్రీహరి పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వసతులు, శిక్షణ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.