జాతీయం
దీపావళి మరుసటి రోజే దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 400 దాటిన ఏక్యూఐ
09-11-2026 12:39
దీపావళి అనంతరం ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోయింది. సగటు ఏక్యూఐ 376 కాగా, సోనియా విహార్, బురారీ సహా పలు ప్రాంతాల్లో 440 దాటింది. సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా కాల్చడంతో కాలుష్య కారకాలు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే 50 రెట్లు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు పలు కేంద్రాల్లో లైవ్ రీడింగ్స్ నిలిచిపోవడంపై విమర్శలు రాగా, కాలుష్యం పేరిట పండుగను బద్నాం చేస్తున్నారని మంత్రి కపిల్ మిశ్రా విమర్శించారు.
xPress24, Delhi, November 9,
దీపావళి వేడుకల అనంతరం దిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా క్షీణించింది. సోమవారం ఉదయం నగరంలోని ప్రధాన ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు దృశ్యమానత పడిపోయింది. ఇందర్‌లోక్ సహా పలు ప్రాంతాలు పొగమంచు దుప్పట్లో చిక్కుకున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సమీర్ యాప్ వివరాల ప్రకారం ఢిల్లీ సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 376గా నమోదై 'చాలా పేలవమైన' కేటగిరీకి చేరింది. అయితే పలు పర్యవేక్షణ కేంద్రాల్లో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది.
400 దాటిన పలు ప్రాంతాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 50 రెట్లు అధికం
సోనియా విహార్‌లో అత్యధికంగా 449 ఏక్యూఐ నమోదు కాగా, బురారీ క్రాసింగ్‌లో 445, వివేక్ విహార్‌లో 441, జహంగీర్‌పురిలో 439, ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో 437, రోహిణిలో 435 నమోదయ్యాయి. డీటీయూ (431), బవానా (424), చాందినీ చౌక్ (418), పట్పర్‌గంజ్ (418), పంజాబీ బాగ్ (408), ఐటీవో (404) ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోయింది. సుప్రీంకోర్టు విధించిన రాత్రి 10 గంటల గడువు దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత పరిమితుల కంటే 50 రెట్లు అధికంగా నమోదైంది.
నిలిచిపోయిన లైవ్ రీడింగ్స్.. రాజకీయ విమర్శలు
దీపావళి రాత్రి వేళ ఆర్కే పురం, నెహ్రూ నగర్, ముండ్కా, సోనియా విహార్, ద్వారక తదితర కేంద్రాల నుంచి ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) వెబ్‌సైట్‌లో లైవ్ రీడింగ్స్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, కాలుష్యం ముసుగులో దీపావళి పండుగను కించపరిచేలా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి ప్రచారం నడుపుతున్నారని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు.