ఆంధ్రప్రదేశ్
దెబ్బతిన్న కరిచర్లగూడెం – సంజీవపురం రహదారి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
11-11-2026 09:31
మొరసు తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండల పరిధిలోని కరిచర్లగూడెం నుంచి సంజీవపురం వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ప్రజలకు రాకపోకల పరంగా ఇబ్బందులు కలగకుండా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
xPress24, Rajamahendravaram, November 10,
మొరసు తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండల పరిధిలోని కరిచర్లగూడెం నుంచి సంజీవపురం వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ప్రజలకు రాకపోకల పరంగా ఇబ్బందులు కలగకుండా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ కరిచర్లగూడెం–సంజీవపురం రహదారిని క్షేత్రస్థాయిలో సందర్శించి, మొరసు తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించారు. భారీ వర్షాలు, వరద ప్రవాహం కారణంగా సుమారు 320 మీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైందని, మరో 700 మీటర్ల మేర రహదారి కోతకు గురై ఒకవైపునకు ఒరిగి, కుంగిపోయిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
రహదారి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, పునరుద్ధరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. దెబ్బతిన్న రహదారిపై ప్రజలు, వాహనదారులు ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గండి పడిన ప్రాంతంలో వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా పైపులైన్లు ఏర్పాటు చేసి, నీటిని సక్రమంగా మళ్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు దెబ్బతిన్న రహదారి ప్రాంతాల్లో అవసరమైన మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రహదారి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.