బిజినెస్
ద్రవ్యోల్బణ భయాలు... వరుసగా మూడో రోజు నష్టాల్లో మార్కెట్లు
23-10-2026 09:45
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 460.30 పాయింట్లు నష్టపోయి 73,249.39 వద్ద, నిఫ్టీ 123.70 పాయింట్లు తగ్గి 22,687.65 వద్ద స్థిరపడ్డాయి.
xPress24, Mumbai, October 22,
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరిగి బ్యారెల్ 112 డాలర్లకు చేరడంతో ద్రవ్యోల్బణ భయాలు నెలకొన్నాయి. ఈ ప్రభావం సూచీలపై పడడంతో వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 94.82 వద్ద కొనసాగుతోంది.
460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఉదయం 73,343.33 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఇదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 73,005.11 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 460.30 పాయింట్ల నష్టంతో 73,249.39 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 123.70 పాయింట్లు నష్టపోయి 22,687.65 వద్ద స్థిరపడింది.
హెచ్చుతగ్గుల్లో ప్రధాన షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 112 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, పసిడి ధర ఔన్సు 4,087.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.