జాతీయం
దిల్లీలో వాయుకాలుష్యం
22-10-2026 10:57

దిల్లీలో వాయుకాలుష్యం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-1ను అమలు చేస్తున్నారు. రానున్న మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని అధికారులు తెలిపారు.
xPress24, Delhi, October 22,
దేశ రాజధాని దిల్లీతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పెరిగిన వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత సూచీ దిగజారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేసేందుకు దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-1ను తక్షణమే అమలు చేస్తున్నట్లు.. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ బుధవారం ప్రకటించింది. రానున్న రోజుల్లోనూ గాలి నాణ్యత ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20న దిల్లీలో వాయు నాణ్యత సూచీ 179గా నమోదు కాగా.. అక్టోబర్ 21న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సూచీ 244కు చేరింది. దీంతో గాలి నాణ్యత 'పూర్' కేటగిరీలోకి వెళ్లింది. ఒక్కరోజు వ్యవధిలోనే కాలుష్య స్థాయులు గణనీయంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత వాతావరణ విభాగం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ అంచనాల ప్రకారం, రానున్న రోజుల్లోనూ దిల్లీలో గాలి నాణ్యత 'పూర్' కేటగిరీలో కొనసాగే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించిన, భారత వాతావరణ శాఖ, ఇతర సంస్థలు కాలుష్యాన్ని మరింత పెరగకుండా నిరోధించేందుకు తొలి దశ చర్యలను అమలు చేయాలని నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి 12 ఏళ్ల కాలంలో రాజధానిలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నదని ఈ సందర్భంగా పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కాలుష్యానికి పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలను బాధ్యులుగా చూపుతూ వచ్చాయని, అయితే సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేకపోయాయని విమర్శించారు.