తెలంగాణ
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
07-11-2026 10:02
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి విద్యా కిట్లను పంపిణీ చేశారు. రూ. 9 కోట్లతో కళాశాల నూతన భవన నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో మరో 10 పాఠశాలల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
xPress24, Mahabubnager, November 6,
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, దుస్తులు, బెల్టులతో కూడిన విద్యా కిట్లను అందజేశారు.
ఉన్నత లక్ష్యాలతో చదవాలి: ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకుని శ్రమించాలని, తమ ప్రతిభతో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాలని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి సూచించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.
రూ. 9 కోట్లతో జూనియర్ కళాశాల నూతన భవనం
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం రూ.9 కోట్ల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతులతో కూడిన మరో 10 నూతన పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు అల్పాహార, భోజన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
బైట్స్
డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్