తెలంగాణ
నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి 'పానీ' యాప్
30-10-2026 09:49

హైదరాబాద్‌లో నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి రూపొందించిన 'పానీ' యాప్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పౌరులు 'సేవ్ వాటర్ వలంటీర్'గా చేరి నీటి దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
xPress24, Hyderabad, October 29,
నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ జలమండలి (HMWSSB) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా 'పానీ' యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నీటి వృథాను అడ్డుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. జలమండలి సిబ్బందితో అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ సాధ్యం కానందున ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు.
'సేవ్ వాటర్ వలంటీర్'గా పౌరులకు అవకాశం
'పానీ' యాప్ ఆధారంగా ప్రతి పౌరుడు 'సేవ్ వాటర్ వలంటీర్'గా పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. నీటి దుర్వినియోగంపై ఫిర్యాదు చేసే వలంటీర్లు కూడా జలసంరక్షణలో భాగస్వాములైనట్లేనని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోరే ప్రతి వ్యక్తి నీటి పొదుపునకు సహకరించాలని సూచించారు.
ఇంకుడుగుంతల ఏర్పాటు అవసరం
హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడినప్పుడు భూగర్భ జలాలు పెంచుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్‌లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. జరిమానాలు విధించి ప్రజలను వేధించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడమే ప్రాధాన్యమని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.