జాతీయం
నేడు కేంద్ర మంత్రిమండలితో ప్రధాని మోదీ సమావేశం... పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష
18-11-2026 10:07

ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సమావేశం కానున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇటీవల సహాయ మంత్రులతో విడివిడిగా సమావేశమైన ప్రధాని, నేడు కేబినెట్ మంత్రులతో భేటీ కానున్నారు.
xPress24, Delhi, November 18,
ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కేంద్ర మంత్రిమండలితో సమావేశం కానున్నారు. దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగనుంది. గత సమావేశంలో నిర్ణయించిన అంశాలు, వివిధ మంత్రిత్వ శాఖలకు అప్పగించిన బాధ్యతల పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ప్రభుత్వ పథకాలు, విధానాల అమలును వేగవంతం చేయడంతో పాటు రాబోయే కాలానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేబినెట్ మంత్రులతో మేధోమథనం
గత సెప్టెంబర్‌లో నిర్వహించిన కేంద్ర మంత్రిమండలి 'చింతన్ శివిర్' సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ వంద శాతం చేరేలా చేయడంపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలకు అనుగుణంగా వివిధ మంత్రిత్వ శాఖలు తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించాయి. ఇటీవల సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులతో ప్రధాని తన కార్యాలయంలో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో నేడు కేబినెట్ మంత్రులతో నిర్వహిస్తున్న ఈ భేటీలో పాలనాపరమైన అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.