ఆధ్యాత్మికం
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు
16-11-2026 10:23

శబరిమల అయ్యప్ప స్వామి మండల మకరవిళక్కు యాత్ర నవంబర్ 17న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.
xPress24, Hyderabad, November 16,
శబరిమల అయ్యప్ప స్వామి మండల మకరవిళక్కు యాత్ర నవంబర్ 17న ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. రేపటి నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. 41 రోజుల పాటు ఆలయం తెరిచి ఉండనుంది. యాత్రకు వచ్చే భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.. విశ్రాంతి తీసుకునే భారీ టెంట్లు, తాగునీరు, వాటర్ కూలర్లు, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఏఐ కెమెరాలతో గట్టి నిఘా పెట్టింది. ముఖ్యంగా ఎక్కడ కూడా తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేరళ ప్రభుత్వం సీనియర్ ఎస్పీలను రంగంలోకి దించింది.
ప్రత్యేక హెల్ప్ లైన్లు
భక్తుల సౌకర్యార్థం రేల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్ లైన్లు, వాహనాల రాకపోకలపై నిఘా ఉంచేందుకు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. కాగా, డిసెంబర్ 27న మండల పూజ తర్వాత ఆలయం మూసివేస్తారు. మూడు రోజుల తర్వాత డిసెంబర్ 30న తిరిగి తెరుస్తారు. 2027 జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. 20న జరిగే ఉత్సవాలతో యాత్ర ముగుస్తుంది.