తెలంగాణ
నేడు దిల్లీలో కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
19-11-2026 09:52

దేశ పారిశ్రామిక రంగ భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధి దిశపై చర్చించేందుకు దిల్లీలో గురువారం కీలక సమావేశం జరగనుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక కన్వెన్షన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
xPress24, Hyderabad, November 19,
దేశ పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసేందుకు దిల్లీలో గురువారం కీలక సదస్సు జరగనుంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సర్వసభ్య సమావేశంతోపాటు వార్షిక కన్వెన్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ‘భారత్ 2047’ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు, రాయబారులు, దౌత్యవేత్తలు, విధాన నిర్ణేతలు సహా 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర, పెట్టుబడుల అవకాశాలు, ఆర్థిక వృద్ధి, నూతన ఆవిష్కరణలపై ఈ వేదికగా చర్చించనున్నారు. మరోవైపు 2026-27 సంవత్సరం FICCIకి శతాబ్ది సంవత్సరం కానుంది. 1927 ఏప్రిల్ 7న స్థాపించిన ఈ సంస్థ 2027 ఏప్రిల్ 7తో వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది.
అంతకుముందు ప్రధాని మోదీ బుధవారం దిల్లీలో బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేట్‌లను కలిశారు. విజన్ 2035 మార్గదర్శకత్వంలో, 2026 జూలైలో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్- యూకే ద్వైపాక్షిక సంబంధాల్లో వస్తున్న సానుకూల పురోగతిని ప్రధాని మోదీ స్వాగతించారు. రక్షణ, ఆరోగ్యం, విద్య, ఫిన్‌టెక్ రంగాలతో పాటు ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. కింగ్ చార్లెస్‌కు, బ్రిటన్ ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను ప్రోత్సహిస్తున్న ఎర్త్‌షాట్ ప్రైజ్ కృషిని ప్రధాని మోదీ అభినందించారు. మంగళవారం ముంబైలో జరిగిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 2026 అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ ఆవిష్కర్తల సేవలకు గుర్తింపు లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.