తెలంగాణ
నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
24-11-2026 11:22
కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2022లో జగన్ ప్రభుత్వం పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో ఇచ్చినప్పుడు కేసీఆర్ స్పందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేఆర్ఎంబీకి, కేంద్రానికి ఫిర్యాదు చేశామని సీఎం తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారని, ఏపీ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
xPress24, Hyderabad, November 23,
నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా అసత్యాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2022లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రూ. 1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అప్పటి ఏపీ సీఎం జగన్ జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారని సీఎం వివరించారు.
పోతిరెడ్డిపాడుకు నిధులు కేటాయించినప్పుడు హరీశ్ రావు మంత్రిగా ఉన్నారు
2005 మార్చి బడ్జెట్‌లోనే పోతిరెడ్డిపాడుకు నిధులు కేటాయించారని, ఆ బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపే నాటికి హరీశ్ రావుతో పాటు ఐదుగురు బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా లేని హరీశ్ రావును వైఎస్ఆర్ మంత్రిని చేశారని, అందుకు గురుదక్షిణగా పోతిరెడ్డిపాడుకు, హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు హరీశ్ రావు అనుమతులు ఇచ్చారని సీఎం ఆరోపించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా, 2015 జూన్ 26న కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు చేసి రాష్ట్ర నీటి హక్కులకు నష్టం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.
భూ నిర్వాసితులకు మూడేళ్లలో రూ. 6,767 కోట్లు ఖర్చు చేశాం
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటామని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానమంత్రిని రెండుసార్లు కలిశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల పాలనలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేసీఆర్ కేవలం రూ. 11,255 కోట్లు, భూ నిర్వాసితుల కోసం రూ. 3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో భూ నిర్వాసితుల కోసం రూ. 6,767 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టూ పూర్తి చేయకపోవడం వల్లే ఏపీ నీళ్లు తరలించుకుపోతోందని సీఎం పేర్కొన్నారు.
Bytes:
రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి