ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లాలో జల వనరుల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ
18-11-2026 10:01

జిల్లాలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలమట్టాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
xPress24, Nandyal, November 17,
నంద్యాల, నవంబర్ 17:
జిల్లాలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలమట్టాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కేంద్ర బృంద సభ్యులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో అమలు చేస్తున్న జల సంరక్షణ పనుల వివరాలను ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం పరిధిలోని జల సంచయ్–జల భాగీదారీ విభాగం ఈఈ రామప్రసాద్, ఎస్‌డీఈ నాగార్జునతో పాటు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో రాతినేలలు అధికంగా ఉండటంతోపాటు, నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండటం, కాలువల సదుపాయం లేకపోవడం వల్ల భూగర్భ జలాల పెంపు సవాలుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
చెరువులను అనుసంధానిస్తూ ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరే క్యాస్కేడ్ విధానంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 27 క్యాస్కేడ్ల పరిధిలోని 86 చెరువుల్లో నీటి నిల్వ, ప్రవాహ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. చెరువులకు నీటిని అందించే కాలువలను గుర్తించి పునరుద్ధరిస్తున్నామని, వాటి భౌగోళిక స్థానాలను నమోదు చేయడం ద్వారా పనుల పర్యవేక్షణను మరింత సులభతరం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలువల అభివృద్ధికి సంబంధించి 2,151 పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
అదేవిధంగా పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీరు నదుల్లో నేరుగా కలవకుండా శుద్ధి చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కుందూ నదిని పరిరక్షించడంతోపాటు రైతులకు అందించే సాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడటం అత్యంత ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.