ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
22-10-2026 17:48

రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
xPress24, Gudiwada, October 22,
కృష్ణా జిల్లా, గుడివాడ, అక్టోబర్ 22, 2026:
రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ రెండో రోజున ఆయన జిల్లాలోని మూడు మండల పరిషత్ కార్యాలయాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయం, పామర్రు నియోజకవర్గ పరిధిలోని పామర్రు మండల పరిషత్ కార్యాలయం, పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు మండల పరిషత్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థులకు అందిస్తున్న సహాయ సహకారాలు, రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా నామినేషన్ల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మూడు మండల పరిషత్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యతనిస్తూ, అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
నామినేషన్ల దాఖలు ప్రక్రియలో అభ్యర్థులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల పనితీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మూడు మండలాల్లోనూ హెల్ప్‌డెస్క్‌ల ద్వారా అభ్యర్థులకు అవసరమైన సమాచారం, సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.