బిజినెస్
నష్టాల్లో ముగిసిన దీపావళి ముహూరత్ ట్రేడింగ్: 81 వేల దిగువకు సెన్సెక్స్, 25 వేల దిగువకు నిఫ్టీ
09-11-2026 09:36

దీపావళి ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ సెషన్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 28 పాయింట్లు తగ్గి 80,999 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి 24,986 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు నష్టపోగా, ఫార్మా షేర్లు, స్మాల్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి. కంపెనీల ఆదాయ వృద్ధి ఆధారంగానే రాబోయే సంవత్‌లో మార్కెట్ గమనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
xPress24, Hyderabad, November 8,
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ నష్టాలతో ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో విక్రయాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 28.62 పాయింట్లు క్షీణించి 80,999.40 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 43.95 పాయింట్లు తగ్గి 24,986.40 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 25,132 గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, అనంతరం లాభాలను నిలబెట్టుకోలేక 25,000 స్థాయి దిగువకు జారింది. సెన్సెక్స్ సైతం 81,442 గరిష్ఠ స్థాయి, 80,932 కనిష్ఠ స్థాయిల మధ్య తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంది.
ఫార్మా రంగానికి లాభాలు.. బ్యాంకింగ్ షేర్ల క్షీణత
నిఫ్టీ సూచీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు సన్ ఫార్మా, టాటా స్టీల్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ప్రధాన సూచీలు తగ్గినప్పటికీ విస్తృత మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.94 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా నిఫ్టీ ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు రాణించగా, నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు అధిక నష్టాలను చవిచూశాయి.
నూతన సంవత్ ప్రారంభం.. నిపుణుల విశ్లేషణ
నూతన విక్రమ సంవత్ ప్రారంభాన్ని సూచిస్తూ దీపావళి లక్ష్మీపూజ సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించారు. రాబోయే కాలంలో కంపెనీల వాస్తవ ఆర్థిక ఫలితాల వృద్ధి ఆధారంగానే మార్కెట్ పనితీరు ఆధారపడి ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.