ఆంధ్రప్రదేశ్
పాడేరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా వంజంగి అంబ్రీష ఎన్నిక
20-11-2026 10:00

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం నూతనంగా ఎన్నికైన 17 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
xPress24, Paderu, November 19,
పాడేరు, నవంబర్ 19:
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం నూతనంగా ఎన్నికైన 17 మంది మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పాడేరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. భానుమూర్తి రాజు, సహాయ రిటర్నింగ్ అధికారి తేజ్ భారత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నుంచి 9 మంది, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి 6 మంది, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి ఒకరు, జనసేన పార్టీ నుంచి ఒకరు చొప్పున మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.
అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక
ప్రమాణ స్వీకారం అనంతరం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించారు. అధ్యక్ష పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాడెలి సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు వంజంగి అంబ్రీష పోటీ చేయగా, ఆమెకు 9 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి గంగపూర్ శివకుమార్‌కు 8 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక ఓటు మెజారిటీతో వంజంగి అంబ్రీష అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
అదేవిధంగా ఉపాధ్యక్ష పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తూవూరి గంగరాజుకు 9 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కిలో సాయి కుమారికి 8 ఓట్లు లభించాయి. దీంతో తూవూరి గంగరాజు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడికి రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను పూల బొకేలతో సత్కరించారు.