ఆంధ్రప్రదేశ్
పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాల భూమి కేటాయింపు
11-11-2026 09:31

పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
xPress24, Amaravati, November 10,
పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా పెనుకొండ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1245-1లో ఉన్న రెండు ఎకరాల భూమిని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కేటాయించనున్నారు. ఈ కళాశాల అందుబాటులోకి వస్తే పదో తరగతి పూర్తి చేసిన యువతకు వృత్తి, సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. తద్వారా కియా పరిశ్రమతో పాటు దాని అనుబంధ సంస్థలు, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలవుతుంది.
ఈ కళాశాల ఏర్పాటుతో పెనుకొండ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల విద్యార్థులకు కూడా స్థానికంగానే సాంకేతిక, వృత్తి విద్యలో శిక్షణ పొందే అవకాశం లభించనుంది.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఐటీఐ కళాశాల ఏర్పాటుతో వృత్తి, సాంకేతిక విద్య అభ్యసించిన విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పెనుకొండ ప్రాంతంలో కియా పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయని, ఆయా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం ఉందని పేర్కొన్నారు. ఐటీఐలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ పరిశ్రమల్లో సులభంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు.
ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుతో వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఎన్నికల హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.