జాతీయం
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో కొన్ని గంటలపాటు అంతరాయం
13-11-2026 12:57

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు అంతరాయం నెలకొంది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది.
xPress24, USA, November 13,
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో శుక్రవారం కొన్ని గంటలపాటు అంతరాయం నెలకొంది. ప్రపంచ దేశాల్లోని అన్ని మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సహా ఇతర మైక్రోసాఫ్ట్ అప్లికేషన్‌లలో అంతరాయం చోటుచేసుకుంది. దీనివల్ల వేలాది మంది వినియోగదారులు వెబ్, డెస్క్‌టాప్ అప్లికేషన్‌లు, మొబైల్ కనెక్షన్‌ల ద్వారా అవుట్‌లుక్‌లో తమ మెయిల్‌బాక్స్‌లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెయిల్ డెలివరీ కూడా ఆలస్యమైంది. తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అవుట్ లుక్ సమస్యలపై దాదాపు లక్షకు పైగా ఫిర్యాదులు అందినట్లు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. ఉదయం 4.30 గంటలకల్లా ఫిర్యాదులు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. ప్రభావిత సర్వర్లను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రమంగా తమ సేవలు మెరుగవుతున్నాయని పేర్కొంది. ప్రభావిత సర్వర్లలో సురక్షిత కనెక్షన్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియే ఈ అంతరాయానికి కీలక కారణమని తమ దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించింది. ఆ ప్రక్రియ వల్ల సర్వర్లపై అధిక భారం పడడంతో అవి కొంతసేపు మొరాయించినట్లు తెలిపింది. ప్రభావిత మౌలిక సదుపాయాలను పునఃప్రారంభించడంతో పాటు.. ఇతర అంశాలు కారణమయ్యాయా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన సేవల్లో మైక్రోసాఫ్ట్ ప్లానర్, టుడూ, డిఫెండర్, పర్‌వ్యూ, గ్రాఫ్, ఫ్యాబ్రిక్, పవర్ బిఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, యూనివర్సల్ ప్రింట్ విండోస్ 365 వంటివి ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్‌లపైనా ప్రభావం..
ఈ సమస్య వల్ల మైక్రోసాఫ్ట్ సొంత అప్లికేషన్లు మాత్రమే కాకుండా దాని మౌలిక సదుపాయాలపై ఆధారపడిన థర్డ్-పార్టీ సేవలు కూడా ప్రభావితమయ్యాయి. మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్ల ద్వారా ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ ఏఐ సేవల్లోనూ అంతరాయం నెలకొంది. మైక్రోసాఫ్ట్ కనెక్టర్లతో ఉన్న ఒక సమస్యపై తాము దర్యాప్తు చేస్తున్నామని.. అది కొత్త కనెక్షన్లను నిరోధించే అవకాశం ఉందని ఓపెన్‌ఏఐ తెలిపింది. తమ మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్‌ను ప్రభావితం చేస్తున్న ఒక అప్‌స్ట్రీమ్ ప్రొవైడర్‌లో సమస్యను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ అంతరాయం కారణంగా తమ వ్యాపారానికి ఆటంకాలు ఏర్పడ్డాయని ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ వర్క్‌హార్స్ గ్రూప్ పేర్కొంది. దీంతో తన మూడో త్రైమాసిక ఫలితాల ప్రకటనను వాయిదా వేసింది.