తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష
04-11-2026 09:53
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌జే, నిమ్స్, జిల్లాల్లోని కీమోథెరపీ కేంద్రాల పనితీరుపై ఆరా తీశారు. కేన్సర్ ముందస్తు గుర్తింపునకు స్క్రీనింగ్, నివారణ చర్యలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా పాల్గొన్నారు.
xPress24, Hyderabad, November 3,
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కేన్సర్ ఆసుపత్రులైన ఎంఎన్‌జే, నిమ్స్ లలో రోగులకు అందుతున్న అత్యాధునిక చికిత్సలు, ఔషధాల లభ్యతను అధికారులు మంత్రికి వివరించారు. ఇదే క్రమంలో బాధితులకు స్థానికంగానే చికిత్స అందించేందుకు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 'డే కేర్ కీమోథెరపీ' సెంటర్ల పనితీరు, రోగులకు చేరువవుతున్న సేవలపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు.
స్క్రీనింగ్, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి: డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరు
ఇటీవలే కేన్సర్‌ను ప్రభుత్వం నోటిఫైడ్ (notifiable) వ్యాధిగా ప్రకటించడంతో పాటు, రోగుల సమగ్ర సమాచార సేకరణ కోసం ప్రత్యేక కేన్సర్ రిజిస్ట్రీ, ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ప్రాథమిక దశలోనే కేన్సర్‌ను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ పరీక్షలను ముమ్మరం చేయడం, వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రభుత్వ ఆసుపత్రులలో కేన్సర్ రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, అంతర్జాతీయ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.