ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నీలిమ నిమ్మల ఏకగ్రీవ ఎన్నిక
21-11-2026 09:44

పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. భామిని జెడ్పీటీసీ సభ్యురాలు, జనసేన పార్టీకి చెందిన నీలిమ నిమ్మల జెడ్పీ చైర్‌పర్సన్‌గా, కురుపాం జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీకి చెందిన వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
xPress24, Paravathipuram, November 20,
పార్వతీపురం మన్యం, నవంబర్ 20:
పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. భామిని జెడ్పీటీసీ సభ్యురాలు, జనసేన పార్టీకి చెందిన నీలిమ నిమ్మల జెడ్పీ చైర్‌పర్సన్‌గా, కురుపాం జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీకి చెందిన వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ నూతన పాలకవర్గ ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సువర్ణముఖి సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి ఆర్. వైశాలి అధ్యక్షతన, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో ఎన్నికల ప్రక్రియ జరిగింది.
ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ సుధాకర్ పంచాయతీరాజ్ చట్టం, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల విధివిధానాలను సభ్యులకు వివరించారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మైనారిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం 15 మంది జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహించగా, చైర్‌పర్సన్‌గా నీలిమ నిమ్మల, వైస్ చైర్‌పర్సన్‌గా వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 2.22 గంటలకు సమావేశం ముగిసింది. అనంతరం ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లకు కలెక్టర్ ఆర్. వైశాలి ధ్రువీకరణ పత్రాలు అందజేసి అభినందించారు.