ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
05-11-2026 09:45
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు.
xPress24, Paravathipuram, November 4,
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 4: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లాలోని 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 6,43,874 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో 3,14,899 మంది పురుషులు, 3,28,910 మంది మహిళలు, 65 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు వివరించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి విధులు, బాధ్యతలపై స్పష్టమైన సూచనలు అందించినట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా తదితర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, అక్కడి నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రిని స్వీకరించి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు.
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.