ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం మన్యం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
07-11-2026 10:01

పార్వతీపురం మన్యం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
xPress24, Paravathipuram, November 6,
పార్వతీపురం మన్యం జిల్లా, నవంబర్ 6: పార్వతీపురం మన్యం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. కౌంటింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, వేగంగా మరియు కచ్చితత్వంతో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు మినహా ఇతర సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు రిజర్వ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
మరోవైపు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అనుమతి ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు పోలీసు బలగాలతో పాటు క్విక్ రియాక్షన్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.