ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
21-10-2026 17:42

దేశ రక్షణతో పాటు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు.
xPress24, Bhimavaram, October 21,
పశ్చిమగోదావరి జిల్లా:
దేశ రక్షణతో పాటు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం భీమవరం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో వారు సంయుక్తంగా పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, దేశ ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ మూలస్తంభమని పేర్కొన్నారు. వాటిని కాపాడటంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దుల రక్షణ కోసం చైనా బలగాలతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలకు గుర్తుగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విపత్తులు, ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు పండుగలు, ఇతర సంతోషకరమైన సందర్భాల్లో తమ కుటుంబాలతో గడుపుతున్నప్పటికీ, పోలీసులు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలూ ప్రజల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.