ఆంధ్రప్రదేశ్
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: కలెక్టర్ హిమాన్షు శుక్లా
21-10-2026 16:26

ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను భావితరాలు గుర్తుంచుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు.
xPress24, Nellore, October 21,
నెల్లూరు:
ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలర్పించిన పోలీసుల సేవలను భావితరాలు గుర్తుంచుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజితతో కలిసి కలెక్టర్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. దేశ భద్రతలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ చెక్కులను పంపిణీ చేశారు.