ఆంధ్రప్రదేశ్
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు
27-10-2026 14:01

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు.
xPress24, Paravathipuram, October 27,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 27: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా పోలీసుల విధులు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ స్టేషన్ల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ విభాగం, లాకప్ గది, స్టేషన్ రైటర్ విధులు, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను వివరించారు. వైర్‌లెస్ పరికరాల పనితీరు, ఆయుధాల వినియోగం, సీసీ కెమెరాల ఉపయోగాలు, వివిధ రకాల బందోబస్తు విధానాల గురించి తెలియజేశారు.
మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు, ఉల్లంఘనలకు విధించే జరిమానాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తమ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, సైబర్ నేరాల బారిన పడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. అత్యవసర పోలీసు సహాయం కోసం 112కు, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు 1930కు ఫోన్ చేయాలని విద్యార్థులకు సూచించారు.