తెలంగాణ
పోలీసుల ఆరోగ్య భద్రతకు 'ఫిట్ కాప్' యాప్: డీజీపీ సీవీ ఆనంద్
07-11-2026 10:02
తెలంగాణ పోలీసు సిబ్బంది ఆరోగ్య పర్యవేక్షణకు 'ఫిట్ కాప్' విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో రూపొందించిన ఈ యాప్ ద్వారా 90 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిగతులను 8 పారామితుల ఆధారంగా నమోదు చేస్తారు. ముప్పు తీవ్రతను బట్టి కాల్ సెంటర్ ద్వారా పరీక్షలు, చికిత్సలు అందించి వ్యాధులను ప్రాథమిక దశలోనే నివారిస్తామని వెల్లడించారు.
xPress24, Hyderabad, November 6,
నిరంతర విధులు, పని ఒత్తిడిలో ఉండే పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 'ఫిట్ కాప్' విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థవంతమైన సేవలు అందించగలరని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సహకారంతో రూపొందించిన పోలీస్ హెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫైల్ సిస్టమ్ యాప్‌ను ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ సమీక్షించారు. రాబోయే 30 నుంచి 45 రోజుల్లో దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
యాప్‌లో 8 రకాల ఆరోగ్య వివరాల నమోదు.. ప్రమాద తీవ్రత గుర్తింపు
ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 90 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది ప్రయోజనం పొందనున్నారు. సిబ్బంది తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లో లాగిన్ అయి ఎనిమిది ప్రధాన ఆరోగ్య అంశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. బీపీ, షుగర్, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), జీవనశైలి, శారీరక శ్రమ, అలవాట్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఈ డేటా ఆధారంగా సిబ్బందిని తక్కువ, మధ్యస్థ, అధిక ఆరోగ్య ముప్పు ఉన్న విభాగాలుగా విభజిస్తారు.
కాల్ సెంటర్ ద్వారా వైద్య సలహాలు, చికిత్స
ముప్పు తీవ్రత ఆధారంగా కాల్ సెంటర్ ద్వారా సిబ్బందిని నేరుగా సంప్రదించి అప్రమత్తం చేస్తామని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సల్మాన్ తెలిపారు. అవసరమైన వారికి ఆసుపత్రుల ద్వారా వైద్య పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తారు. కిడ్నీ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించడానికి ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని డీజీపీ వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఏడీజీ అకున్ సబర్వాల్, ఐజీపీ గజరావు భూపాల్, టి-స్పార్క్ ఎస్పీ రూపేష్, ఎస్పీ అవినాష్, ఆరోగ్య భద్రత కార్యదర్శి ఉదయ్ కుమార్ రెడ్డి (రిటైర్డ్) తదితరులు పాల్గొన్నారు.