ఆంధ్రప్రదేశ్
పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
21-10-2026 16:12

ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
xPress24, Srikakulam, October 21,
శ్రీకాకుళం, అక్టోబర్ 21:
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసుల సేవలు లేకుండా సమాజంలో ప్రగతి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
గత రెండేళ్లకు పైగా జిల్లా పరిపాలనలో పోలీసుల పాత్రను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. ఎన్నికలు, తుపానులు, బందోబస్తు విధులు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ముందుండి విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు.
ప్రజలతో మాట్లాడే సమయంలో పోలీసులు సంయమనం, మర్యాదపూర్వక ప్రవర్తనను పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహరించే తీరుపైనే ప్రభుత్వ వ్యవస్థ ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాలో గంజాయి నియంత్రణ, మహిళల భద్రతకు సంబంధించి పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్, సైబర్ నేరాల నియంత్రణలోనూ ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు.