జాతీయం
పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించిన కేంద్రం: గెజిట్ నోటిఫికేషన్ విడుదల
06-11-2026 15:21
భారత్‌లో నివసిస్తున్న పలు కేటగిరీల విదేశీయులు, శరణార్థులకు కేంద్రం పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించింది. నేపాల్, భూటాన్ ప్రయాణాలకు గుర్తింపు కార్డు ఉంటే పాస్‌పోర్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది. 2015 లోపు వచ్చిన శ్రీలంక తమిళులు, 2024 లోపు వచ్చిన మూడు పొరుగు దేశాల మైనారిటీలు, గుర్తింపు కార్డులు లేని కొందరు పాక్ పౌరులకు మినహాయింపులు ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
xPress24, Delhi, November 6,
దేశంలో నివసిస్తున్న పలు కేటగిరీల విదేశీ పౌరులు, శరణార్థులకు ఊరట కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్, వీసా నిబంధనలను సడలించింది. ఈ మేరకు అధికారిక గెజిట్‌లో ‘ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ (మినహాయింపు) (సవరణ) ఉత్తర్వులు, 2026’ను ప్రచురించింది. వీసాలు, ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలకు సంబంధించిన సూచనలతో కేంద్రం ఎప్పటికప్పుడు జారీ చేసే ‘వీసా మాన్యువల్’ ప్రాతిపదికన ఈ మార్పులు చేపట్టినట్లు పేర్కొంది.
నేపాల్, భూటాన్ ప్రయాణాలకు పాస్‌పోర్ట్ మినహాయింపు
సవరించిన నిబంధనల ప్రకారం.. భారత పౌరులు భూమార్గం లేదా వాయుమార్గం ద్వారా నేపాల్, భూటాన్ దేశాలకు ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్ తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులకు వీసా మాన్యువల్‌లో పేర్కొన్న గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది. ఇదే నిబంధన భారత్‌లోకి వచ్చే, వెళ్లే నేపాల్, భూటాన్ పౌరులకు సైతం వర్తిస్తుంది.
శరణార్థులు, విదేశీ పౌరులకు ప్రత్యేక వెసులుబాటు
2015 జనవరి 9 నాటికి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్న నమోదిత శ్రీలంక తమిళ పౌరులను మినహాయింపు విభాగంలో చేర్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపుల కారణంగా భారత్‌కు వచ్చి, 2024 డిసెంబర్ 31 నాటికి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాల వారికి పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే వారు ఇక్కడ కొనసాగేందుకు తగిన వీసా పొందాల్సి ఉంటుంది.
శాశ్వతంగా స్థిరపడే ఉద్దేశంతో 2009 డిసెంబర్ 31 లేదా అంతకుముందు భారత్‌లోకి వచ్చి, పాకిస్తాన్ జారీ చేసే కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డు (CNIC) లేక పాస్‌పోర్టులు పునరుద్ధరించుకోలేకపోయిన వారికి కూడా మినహాయింపు వర్తిస్తుంది.
దేశ విభజన నాటి బాధితులు, మలేషియా/సింగపూర్ పౌరులు:
విభజన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి 1965 డిసెంబర్ 31 మధ్య పాకిస్తాన్ వెళ్లి, తిరిగి 2009 డిసెంబర్ 31 నాటికి భారత్‌కు వచ్చిన భారత మూలాలున్న ముస్లిం పురుషులకు వెసులుబాటు కల్పించారు. అలాగే మలేషియా లేదా సింగపూర్ పౌరసత్వం పొంది, పాస్‌పోర్టుల గడువు ముగిసి పునరుద్ధరణ సాధ్యం కాక 2009 డిసెంబర్ 31 లోపు భారత్‌కు చేరిన భారత సంతతి వ్యక్తులకు కూడా ఇందులో చోటు కల్పించారు. ఇవి కాకుండా అధికారిక విధుల్లో భాగంగా ప్రయాణించే భారత త్రివిధ దళాల సిబ్బంది, కుటుంబ సభ్యులు, మరమ్మతుల కోసం భారత్‌కు వచ్చే విదేశీ నౌకాదళాల సిబ్బందికి మిలిటరీ షిప్ రిపేర్ పర్మిట్ ఆధారంగా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.