జాతీయం
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాం: కిషన్ రెడ్డి
24-10-2026 09:51
దిగుమతులను తగ్గించేందుకు రూ.46,000 కోట్ల వ్యయంతో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యంగా ప్రత్యేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
xPress24, Newdelhi, October 23,
ఎరువులు, సింథటిక్ వాయువుల దేశీయ ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రూ.46,000 కోట్ల వ్యయంతో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బొగ్గును కీలక పారిశ్రామిక ముడిసరుకుగా పేర్కొన్న ఆయన, దాని ద్వారా సిన్-గ్యాస్, అమ్మోనియా, యూరియా, మిథనాల్ తయారీ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. దేశ ప్రాథమిక ఇంధన అవసరాల్లో 55 శాతం, విద్యుత్ ఉత్పత్తిలో 74 శాతం బొగ్గు ద్వారానే లభిస్తోందని పేర్కొన్నారు.
బొగ్గు గ్యాసిఫికేషన్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు
2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలనే లక్ష్యంతో కేంద్ర కేబినెట్ రూ.37,500 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్, రక్షణ రంగానికి అవసరమైన కీలక ఖనిజాల తవ్వకాల కోసం అర్జెంటీనా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు.
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కారిడార్ అభివృద్ధి
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశీయంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన ముడిసరుకులు, ఖనిజాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ చర్యలు దోహదపడతాయని వెల్లడించారు.
బైట్ - కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి