తెలంగాణ
బోడుప్పల్‌లో ఆధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన
24-10-2026 14:47

ప్రయాణికుల రద్దీని తగ్గించి, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతోహైదరాబాద్ బోడుప్పల్‌లో ఆధునిక సిటీ బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
xPress24, Hyderabad, October 24,
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్-10, ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్ వద్ద రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్‌ను 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు అధునాతన సౌకర్యాలతో బస్ టెర్మినల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి రోజుకు 1,053 బస్సు ట్రిప్పులు నడుస్తున్నాయని, కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే రోజుకు లక్ష మంది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు నడుస్తున్నాయని వివరించారు. బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త బస్ స్టేషన్‌కు ఈ ప్రాంతాల పేరుతో నామకరణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 3,000కు పైగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో కొత్త రూట్లలో బస్సులను నడుపుతున్నామని, ప్రజలకు ఎక్కడ బస్సుల అవసరం ఉన్నా అధికారులకు విజ్ఞప్తులు అందించాలని సూచించారు. తొలి దశలో 250 పాత డీజిల్ బస్సులను రీట్రోఫిట్ చేస్తున్నామని, నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు. రాఖీ పౌర్ణమి రోజున కూడా ఆర్టీసీ సిబ్బంది అక్కాచెల్లెళ్ల ప్రయాణాలకు సేవలందించారని పేర్కొన్నారు. బస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించామని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సీసీఎస్, పీఎఫ్ బకాయిలను విడతలవారీగా చెల్లిస్తున్నామని, పీఆర్సీలు అమలు చేశామని చెప్పారు. డీఏ బకాయిలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పదేళ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికైన సంఘంతో కమిటీ ఏర్పాటు చేసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రిఫ్లెక్టర్లను అందు బాటులోకి తీసుకురావడంతో పాటు స్క్రాప్ పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ ఆటోల కోసం రూ.200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. బస్ టెర్మినల్ నిర్మాణానికి రూ.3.22 కోట్లు కేటాయించిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.