క్రీడలు
బుమ్రాకు 3 వికెట్లు.. నికోల్స్ సెంచరీ- భారత్ న్యూజిలాండ్ తొలి టెస్టు
19-11-2026 14:50

భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి రోజు ఆట ముగిసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 243-5 స్కోర్ తో ఉంది.
xPress24, Hyderabad, November 19,
వెల్లింగ్టన్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ప్రసుతం కివీస్ 243-5 స్కోర్ తో నిలిచింది. హెన్రీ నికోల్స్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. క్రీజులో నికోల్స్ (113 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (94 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. అన్షుల్ కంబోజ్, ఆకాశ్ దీప్ చెరో 1 వికెట్ పడగొట్టారు.
లంచ్ వరకు భారత్ దే ఆధిపత్యం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఈ మ్యాచ్ లో తొలి సెషన్ భారత్ దే ఆధిపత్యంగా సాగింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన బుమ్రా... ఇన్నింగ్స్ మూడో బంతికే టామ్ లేథమ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేసి కివీస్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వేను అన్షుల్ కంబోజ్ పెవిలియన్ కు పంపించాడు. 50 బంతులు ఎదుర్కొన్న రచిన్ రవీంద్ర (15)ను ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. కాసేపటికే డారిల్ మిచెల్ (1)ను బుమ్రా ఔట్ చేసి కివీస్ ను దెబ్బ కొట్టాడు. దీంతో లంచ్ కు ముందే కివీస్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా టామ్ బ్లండెల్ (5)ను కూడా బుమ్రానే పెవిలియన్ కు చేర్చాడు. దీంతో 70 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆదుకున్న హెన్రీ- ఫిలిప్స్
100 పరుగుల లోపే ఐదు వికెట్లు కోల్పోయిన కివీస్ ను హెన్రీ- ఫిలిప్స్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. క్రీజులో పాతుకుపోయి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే నికోల్స్ శతకం సాధించాడు. మరోవైపు ఫిలిప్స్ కూడా సెంచరీకి చేరువగా వచ్చాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు అజేయంగా 173 పరుగులు చేశారు. దీంతో ఆఖరి సెషన్ లో సీన్ మారింది. ఈ భాగస్వామ్యంతో పుంజుకున్న కివీస్ డీసెంట్ స్కోర్ సాధించే దిశగా సాగుతోంది.