ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్ బాక్సుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలి
21-10-2026 17:42

పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026లో పోలైన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
xPress24, Visakhapatanam, October 21,
విశాఖపట్నం:
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026లో పోలైన బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సుల రవాణా, భద్రపరిచే ప్రక్రియ, భద్రత, నిరంతర పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులతో పాటు ప్రిసైడింగ్ అధికారి డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్‌ను నిర్దేశించిన వాహనాల్లో, నిర్ణీత మార్గాల ద్వారా పోలీసు భద్రత నడుమ రిసెప్షన్ కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. ఈ వాహనాలను అభ్యర్థులు, వారి పోలింగ్ ఏజెంట్లు అనుసరించేందుకు అనుమతించాలని ఆదేశించారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరచాలని పేర్కొన్నారు.
స్ట్రాంగ్‌రూమ్‌లకు రెండు తాళాల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, అక్కడ ద్వంద్వ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, ప్రవేశ ద్వారం వద్ద, పరిసర ప్రాంతాల్లో 24 గంటల పాటు నిరంతర సీసీటీవీ నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌కు 100 మీటర్ల పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సీసీటీవీ దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచే, మూసివేసే ప్రతి సందర్భంలో అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూమ్‌ను తెరవాలని స్పష్టం చేశారు.
రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌రూమ్ ప్రాంగణాన్ని, భద్రతా ఏర్పాట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, లాగ్‌బుక్‌తో పాటు వీడియో రికార్డులను పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ, పోలైన బ్యాలెట్ బాక్సులకు పూర్తి భద్రత కల్పించాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ప్రత్యేక ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.