ఆంధ్రప్రదేశ్
బుర్రిపాలెంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని
05-11-2026 15:49

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
xPress24, Tenali, November 5,
తెనాలి: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన స్వగ్రామానికి వచ్చి ఇక్కడే ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు.
ఎన్నికలు ఏ స్థాయిలో జరిగినా ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అసలైన బలమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, సమర్థవంతమైన ప్రజాప్రతినిధుల ఎంపికలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.
ప్రజలందరూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంతో పాటు తమ హక్కులను కాపాడుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు.