ఆంధ్రప్రదేశ్
బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ ఆరా.. వేగంగా కోలుకుంటోందని వైద్యుల వెల్లడి
19-11-2026 09:48

రాప్తాడులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారు.
xPress24, Amaravati, November 18,
రాప్తాడులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో మాట్లాడిన ఆయన.. బాలిక ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స, కోలుకుంటున్న తీరు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరాలు తెలుసుకున్నారు.
బాలిక ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకుంటోందని, ఆక్సిజన్ స్థాయులు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. నోటి ద్వారా ఆహారం తీసుకుంటోందని, ప్రధాన గాయాలు మానిపోయాయని చెప్పారు. కుట్లు తొలగించామని, చిన్నపాటి గాయాలకు చికిత్స కొనసాగిస్తున్నామని వివరించారు.
బాలిక ఇతరుల సహాయంతో నెమ్మదిగా నడుస్తోందని, గతంతో పోలిస్తే ఎక్కువ అడుగులు వేయగలుగుతోందని వైద్యులు తెలిపారు. కుడిచేత్తో నీళ్ల గ్లాసు పట్టుకునే స్థాయికి చేరుకుందని, పెన్ను పట్టుకుని రాసేందుకు అవసరమైన శిక్షణ కూడా ప్రారంభించామని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకోగలుగుతోందని వెల్లడించారు. బాలిక వేగంగా కోలుకుంటోందని వైద్యులు చెప్పడంతో మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బాలిక ఎదుర్కొన్న బాధను మాటల్లో వర్ణించలేమని అన్నారు. చిన్న వయసులోనే అంతటి కష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఎంతో ధైర్యంగా పోరాడిందని కొనియాడారు. బాలికను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. శారీరక గాయాలు మానినప్పటికీ, మానసికంగా కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. అందుకే వైద్య చికిత్సతో పాటు ప్రేమ, ఆప్యాయత, మానసిక ధైర్యాన్ని కూడా అందించాలని సూచించారు.
బాలిక మళ్లీ స్వేచ్ఛగా నడవాలని, తన చేతులతో రాయాలని, తోటి పిల్లలతో కలిసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. తన కలలను సాకారం చేసుకునేలా ఎదగాలని, అందుకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.