ఆంధ్రప్రదేశ్
బాలల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్
18-11-2026 10:00

బాలలపై జరిగే లైంగిక వేధింపులు, నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ సూచించారు.
xPress24, Viziayanagaram, November 17,
విజయనగరం, నవంబర్ 17:
బాలలపై జరిగే లైంగిక వేధింపులు, నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ సూచించారు. బాలలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (APSLSA) మార్గదర్శకాల మేరకు 'సురక్షిత్ బచ్పన్ అభియాన్'లో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురం, డెంకాడ మండలాల్లోని ఏపీ మోడల్ పాఠశాలల్లో పోక్సో చట్టం–2012పై న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కృష్ణ ప్రసాద్ విద్యార్థులకు బాలల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. బాలలు తమకు ఎదురయ్యే వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుచిత సంఘటన ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.