ఆంధ్రప్రదేశ్
బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్
21-11-2026 09:42

బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ అన్నారు.
xPress24, Paravathipuram, November 20,
పార్వతీపురం మన్యం, నవంబర్ 20:
బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఉమ్మడి విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ అన్నారు. విద్యార్థులు తమ హక్కులు, చట్టాలు, రక్షణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దోపిడీ వంటి నేరాలను అరికట్టడంతో పాటు, వారికి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ చట్టంలోని ముఖ్య నిబంధనలు, బాలల హక్కులు, వారికి చట్టం కల్పిస్తున్న రక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. బాలల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.