ఆంధ్రప్రదేశ్
భక్తులకు నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు
30-10-2026 09:52

తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోందని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు.
xPress24, Tirupati, October 29,
తిరుపతి, అక్టోబర్ 29: తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోందని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. గురువారం తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం నీటి నిల్వల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించి, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై సమీక్షించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల వరకు సరిపోతాయని వెల్లడించారు. భక్తులకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలోని డ్యామ్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని వివరించారు. నీటి నిల్వలు, సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.