ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి
26-10-2026 14:27

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు ఇతర మండలాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు.
xPress24, Kakinada, October 26,
కాకినాడ, అక్టోబర్ 25:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు ఇతర మండలాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకులు, ఇంధనం, వంటగ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల సమయంలో ఇంధన కొరత తలెత్తకుండా జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచాలని బంకుల యజమానులకు సూచించారు. వర్షాలు కురిసే సమయంలోనూ పెట్రోల్ బంకులు 24 గంటల పాటు పనిచేసేలా షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
వంటగ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా గ్యాస్ ఏజెన్సీలు ముందుగానే తగినన్ని సిలిండర్లను సమకూర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న గ్యాస్ డెలివరీలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, సాధారణ సరఫరాకు అదనంగా మరో లోడ్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులు వర్షపు నీటికి తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సరుకులను వర్షాలు లేని సమయంలో ఇంటింటికీ పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు.
భారీ వర్షాల దృష్ట్యా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు సెలవులు పెట్టకుండా తమ తమ మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ స్పష్టం చేశారు. నిత్యావసర సరుకులు, ఇంధన లభ్యతపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారికి లేదా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.