జాతీయం
భారత్-నేపాల్ మధ్య అనుసంధానతకు కొత్త అడుగు.. నేడు 'సరయూ-కమల ఎక్స్‌ప్రెస్' ప్రారంభం
23-11-2026 12:38
భారత్, నేపాల్ దేశాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్, నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ మధ్య వారానికి ఒక రోజు నడిచే కొత్త రైలు సేవ సరయూ-కమల ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఇవాళ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
xPress24, Delhi, November 23,
భారత్, నేపాల్ దేశాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్, నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ మధ్య వారానికి ఒక రోజు నడిచే కొత్త రైలు సేవ సరయూ-కమల ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఇవాళ న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయోధ్యలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉన్న శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య, సీతాదేవి జన్మస్థలం జనక్‌పూర్ ధామ్‌లను కలుపుతూ... ఈ రైలు ప్రయాణించనుంది. సుమారు 604 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. జయనగర్, మధుబని, శిశో, సీతామఢీ, రక్సౌల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ, మన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్లలో ఈ రైలుకు వాణిజ్యపరమైన హాల్టులు కల్పించారు. శనివారాల్లో జనక్‌పూర్ ధామ్ నుంచి, సోమవారాల్లో అయోధ్య కంటోన్మెంట్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. ఈ కొత్త రైలు సేవ అందుబాటులోకి రావడంతో ఇరు దేశాల యాత్రికులు, పర్యాటకులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకం, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోవడానికి ఈ రైలు మార్గం దోహదపడనుంది.