జాతీయం
భారత సైన్యం సాయంతో సివిల్ డిఫెన్స్ మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ
24-10-2026 09:50

సివిల్ డిఫెన్స్ వ్యవస్థను బలపరిచేందుకు కేంద్ర హోంశాఖ భారత సైన్యం సాయంతో ప్రత్యేక శిక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది. తొలి విడతలో 12 రాష్ట్రాలకు చెందిన 600 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
xPress24, Delhi, October 23,
దేశంలో సివిల్ డిఫెన్స్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం సాయంతో సివిల్ డిఫెన్స్ మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు వినూత్న పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోమ్‌గార్డ్స్ డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ సాగుతుంది. నవంబర్ రెండవ వారం నాటికి తొలి విడతగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
12 రాష్ట్రాల నుంచి 600 మందికి శిక్షణ
తొలి విడతలో ఎంపిక చేసిన ప్రతి రాష్ట్రం నుంచి 50 మంది చొప్పున మొత్తం 600 మంది సివిల్ డిఫెన్స్ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, మేఘాలయ, సిక్కిం, అసోం, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. భద్రతా సవాళ్లు, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా వీరిని సిద్ధం చేస్తారు.
3 ప్రధాన అంశాలపై శిక్షణ
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆధునిక సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్ నిర్మణ లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ప్రమాదాల ముప్పుపై అవగాహన, రక్షణ చర్యలు, అత్యవసర స్పందన, సమాచార మార్పిడి-సమన్వయం అనే 3 ప్రధాన అంశాలపై శిక్షణ ఇస్తారు.