అంతర్జాతీయం
మనీలా 'గురుద్వారా ఖల్సా దివాన్' పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన.. ప్రవాస భారతీయులతో మాటామంతీ
17-11-2026 11:31

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అత్యంత పురాతనమైన 'గురుద్వారా ఖల్సా దివాన్' పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో, మనీలా మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించారు. అనంతరం మనీలాలో జరగనున్న 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
xPress24, philippines, November 17,
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన 'గురుద్వారా ఖల్సా దివాన్' పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 1901లో స్థాపించబడి, 1903లో అధికారికంగా రూపుదిద్దుకుని, 1924లో 'ఖల్సా దివాన్'గా నమోదైన ఈ గురుద్వారా ఫిలిప్పీన్స్‌లోనే అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మనీలాలోని సిక్కు సమాజానికి, స్థానిక ప్రజలకు మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల ద్వారా ఈ గురుద్వారా వారధిగా నిలుస్తోందని పేర్కొంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ సెనేటర్ ఫ్రాన్సిస్ జోసెఫ్ ఎస్కుడెరో, మనీలా నగర మేయర్ ఫ్రాన్సిస్కో ఇస్కో మోరెనో పాల్గొన్నారు. అనంతరం ప్రవాస భారతీయులు, సిక్కు సమాజ ప్రతినిధులతో ప్రధాని మోదీ మాట్లాడారు.
నేడు ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని
2026 ఏడాదికి ఆసియాన్ ఛైర్మన్ హోదాలో ఫిలిప్పీన్స్ ఆతిథ్యం ఇస్తున్న 23వ ఆసియాన్-భారత్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఆసియాన్-భారత్ సదస్సులో భాగంగా 2026-2030 కార్యాచరణ ప్రణాళికతో పాటు ఇరు పక్షాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిని సమీక్షించి, భవిష్యత్ సహకార దిశపై చర్చిస్తారు. తూర్పు ఆసియా సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాలపై వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ అభిప్రాయాలు పంచుకుంటారు.