తెలంగాణ
మరో 5 నగరాలకు ఇందిరమ్మ టవర్ల విస్తరణ.. దరఖాస్తులను ఆహ్వానించిన తెలంగాణ హౌసింగ్ బోర్డు
13-11-2026 09:35
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ నగరాలకు విస్తరించినట్లు హౌసింగ్ బోర్డు తెలిపింది. రూ. 204 కోట్ల వ్యయంతో 2,400 ఫ్లాట్లను నిర్మించనుండగా, ఒక్కో ఫ్లాటుకు రూ. 5 లక్షల ప్రభుత్వ సాయం అందనుంది. వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉన్న స్థానిక ఇల్లు లేని కుటుంబాలు డిసెంబర్ 5లోపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.
xPress24, Hyderabad, November 12,
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలోని మరో ఐదు ప్రధాన నగరాలకు విస్తరించినట్లు రాష్ట్ర హౌసింగ్ బోర్డు ప్రకటించింది. నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ నగరాల్లో హౌసింగ్ బోర్డు భూముల్లో రూ. 204 కోట్ల వ్యయంతో మొత్తం 2,400 ఎల్ఐజీ ఫ్లాట్లను నిర్మించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా ఈ ఐదు నగరాల్లో ఒక్కో చోట జీ+5 (G+5) టవర్ల రూపంలో 480 ఫ్లాట్లను నిర్మించనున్నట్లు హౌసింగ్ బోర్డు పేర్కొంది. ఒక్కో ఫ్లాటు నిర్మాణానికి రూ. 8.50 లక్షలు వ్యయం కానుండగా, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపింది. మిగిలిన రూ. 3.50 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
డిసెంబర్ 5 వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుకు అవకాశం
ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివసిస్తూ సొంత ఇల్లు లేని స్థానిక అల్పాదాయ కుటుంబాలు ఈ పథకానికి అర్హులని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తుదారుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలని నిబంధన విధించింది. ఆసక్తి గల అర్హులు రూ. 100 దరఖాస్తు రుసుము, రూ. 10 వేల డిపాజిట్ చెల్లించి డిసెంబర్ 5వ తేదీలోపు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచించారు.