ఆంధ్రప్రదేశ్
మురసు తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ పి. రాజాబాబు
02-11-2026 12:03
మురసు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సూచించారు.
xPress24, Ongole, November 2,
ఒంగోలు, 02 నవంబర్ 2026 :
మురసు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సూచించారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని, అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పూరిగుడిసెల్లో ఉంటున్న వారు ముందుగానే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా రాబోయే రెండు రోజుల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఏవైనా అత్యవసర అవసరాలు లేదా సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్
18004250277
లేదా
08592-295600
కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన సూచించారు.